ఘ‌నంగా ప్రారంభ‌మైన మేక‌పాటి గౌతం రెడ్డి ఇంట‌ర్నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ మెడిటేష‌న్‌-ద‌మ్మ‌ …రూ 4 కోట్ల వ్య‌యంతో నిర్మించిన మేక‌పాటి కుటుంబం…మ‌హాబోధి సొసైటీకి అప్ప‌గించిన కుటుంబ స‌భ్యులు.

ఆధ్యాత్మికం

విశాఖపట్నం, ఫిబ్రవరి 21 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : మ‌హాబోధి సొసైటీ-ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం సంయుక్త స‌హ‌కారంతో ఏయూలో దాదాపు రూ 4 కోట్ల వ్య‌యంతో నిర్మిత‌మైన మ‌హాబోధి మేక‌పాటి గౌతంరెడ్డి ఇంట‌ర్ నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ మెడిటేష‌న్-ద‌మ్మ కేంద్రం శ‌నివారం ఉదయం ప్రారంభ‌మైంది. మాజీ పార్ల‌మెంట్ స‌భ్యులు మేక‌పాటి రాజ‌మోహ‌న్‌ రెడ్డి-మ‌ణిమంజ‌రి దంప‌తులు ఈ అంత‌ర్జాతీయ మెడిటేష‌న్ సెంట‌ర్‌ను నిర్మించి మ‌హాబోధి సొసైటీ-ఏయూకు బ‌హూక‌రించారు. త‌మ కుమారుడు మాజీ మంత్రి మేక‌పాటి గౌతం రెడ్డి జ్ఞాప‌కార్దం, స‌మాజంలో శాంతి, సంతోషాల‌ను అందించే వేదిక‌గా ఇది నిల‌వాల‌ని ఆకాంక్ష వ్య‌క్తం చేశారు. విశ్వ‌విద్యాల‌యంలో ఉన్న విద్యార్థుల‌కు, రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌కు ఉప‌యుక్తంగా ఈ కేంద్రం సేవ‌లు అందిస్తుంద‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా విశ్వ‌విద్యాల‌య ప్రాంగ‌ణంలో ఇటువంటి ధ్యానం కేంద్రం తొలిసారిగా ఏర్పాటు అయింద‌ని, ఇది ఇత‌ర విశ్వ‌విద్యాల‌కు మార్గ‌ద‌ర్శ‌కంగా నిలుస్తుందన్నారు. దీనికి స‌హ‌కారం అందించిన ఏయూ అధికారుల‌కు, మ‌హాబోధి సొసైటీ స‌భ్యుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. నేటి యాంత్రిక జీవ‌నంలో తీవ్ర‌మైన ఒత్తిడికి లోన‌వుతున్న ప్ర‌జ‌ల‌కు ఇటువంటి ధ్యాన కేంద్రాలు ఎంతో ఉప‌యుక్తంగా నిలుస్తాయ‌న్నారు. స‌మాజ ఉప‌యుక్తంగా నిలిపే ఉద్దేశంతో శాంతిని, ప్ర‌జ‌ల శ్రేయ‌స్సును కాంక్షిస్తూ దీనిని నిర్మించామ‌న్నారు. సామాజిక మాధ్య‌మాలు యువ‌త మ‌న‌స్సుపై చూపుతున్న తీవ్ర ప్ర‌భావాల నేప‌ధ్యంలో ఇటువంటి ధ్యాన కేంద్రాలు వారికి చ‌క్క‌ని మార్గాన్ని చూపే విధంగా నిలుస్తాయ‌న్నారు. మ‌హాబోధి సొసైటీ-ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం చేసుకున్న ఒప్పందంలో భాగంగా దాదాపు 15 వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ద‌మ్మ‌(ధ్యాన‌) హాల్‌ను, మెద‌టి అంత‌స్థులో విపాస‌న మెడిటేష‌న్ హాల్‌, బౌద్ద బిక్షువులు ఉండ‌టానికి 5 గ‌దులు, విపాస‌న మెడిటేష‌న్‌కు వ‌చ్చే స్త్రీ పురుషుల‌కు వేర్వేరుగా రెండు డార్మెట‌రీలు నిర్మించారు. లిఫ్ట్ స‌దుపాయం కూడా క‌ల్పించారు.ఈ కేంద్రంలో త్రిపిటిక లైబ్ర‌రీని సైతం ఏర్పాటు చేస్తున్నారు. స‌మాజంలో శాంతిని, ప్రేమ‌ను కాంక్షిస్తూ ప్ర‌జ‌లు త‌మ ఒత్తిడి నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌డానికి, జ్ఞానంతో కూడిన ప్ర‌శాంత‌త‌ను అందించే అంత‌ర్జాతీయ ధ్యాన కేంద్రంగా దీనిని తీర్చిదిద్దారు. మ‌హాబోధి సొసైటీ అద్య‌క్షులు, గురు బంటె క‌స్స‌ప మ‌హ‌తీర బంటె జీ, కార్య‌ద‌ర్శి ఆనంద థీర‌ బంటె జీ, ఇంచార్చి బిక్కు ద‌ర్మ ద‌త్త బంటెలు ప్ర‌త్యేక ప్రార్ధ‌న‌లు జ‌రిపారు. స‌మాజంలో శాంతిని కాంక్షిస్తూ, స‌మాజ సంక్షేమంకోసం ఇటువంటి మంచి కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో మేక‌పాటి గౌతం రెడ్డి స‌తీమ‌ణి శ్రీ కీర్తి రెడ్డి, కుమార్తె అన‌న్య రెడ్డి, కుమారుడు కృష్ణార్జున రెడ్డి, సోద‌రులు విక్రం రెడ్డి, ఫృద్వీ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్రాంగ‌ణంలో స్వ‌ర్గీయ మేక‌పాటి గౌతం రెడ్డి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించి, పూల‌మాల వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం మెడిటేష‌న్ హాల్‌లో స‌మాజ హితాన్ని, శాంతిని కాంక్షిస్తూ బౌద్ద బిక్షువులు ప్ర‌త్యేక ప్రార్ధ‌న‌లు చేశారు. మ‌హాబోధి సొసైటీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హ‌ణ‌…. ఏయూలో నెల‌కొల్పిన అంత‌ర్జాతీయ ధ్యాన కేంద్రంలో మ‌హాబోధి సొసైటీ ఆధ్వ‌ర్యంలో నైతిక‌,సాంఘిక విద్య కార్య‌క్ర‌మాలు, మైండ్‌ఫుల్‌నెస్‌, సామాజిక‌-భావోద్వేగ అభ్యాస కార్య‌క్ర‌మాల‌లో కోర్సులు, మాన‌వ విలువ‌లు, స‌మ‌గ్ర శ్రేయ‌స్సుపై ప‌రిశోధ‌న‌లు, సైన్స్‌,నీతి మ‌రియు ఆలోచ‌నాత్మ‌క ప‌ద్ద‌తుల‌ను ఏకీకృతం చేసే కార్య‌క్ర‌మాలు, ధ‌మ్మ ప‌రిశోధ‌న మ‌రియు బౌద్ధ అధ్య‌య‌న కార్య‌క్ర‌మాలు, ధ్యాన శిక్ష‌ణ‌, వ్య‌క్తిత్వ వికాస కోర్సులు, ఒత్తిడి,ఆందోళ‌న మ‌రియు భావోద్వేగాల స‌వాళ్ల‌ను ఎదుర్కొంటున్న విద్యార్థులు, వ్య‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన కౌన్సెలింగ్ సేవ‌లు అందించ‌డం, కెరీర్ మార్గ‌ద‌ర్శ‌క‌త్వం, జీవ‌న నైపుణ్యాల అభివృద్ధి కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌, యోగా,మాన‌సిక ఆరోగ్యం మ‌రియు స‌మ‌గ్ర ఆరోగ్య కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. ఈ కేంద్రం విద్య నైపుణ్యం మ‌రియు అంత‌ర్గ‌త శ్రేయ‌స్సు మ‌ధ్య అంత‌రాన్ని త‌గ్గించ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *