
విశాఖపట్నం,ఏప్రిల్ 9 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్: బెనెడిక్టిన్ సన్యాసి, శాంతివనం సచ్చిదానంద ఆశ్రమ ప్రియర్ ఫాదర్ దొరథిక్ రాజన్ కి ఆధ్యాత్మిక పరిశోధన మరియు శాంతి స్థాపనలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా “స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు” ప్రదానం చేశారు. ఈ పురస్కారాన్ని అమెరికా లోని ఈ క్యూ ఫర్ పీస్ ఉపాధ్యక్షుడు మరియు డీన్ వాన్ ల్యూవెన్ సెంటర్ ఫర్ పీస్ స్టడీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డా. చల్లా కృష్ణవీర్ అభిషేక్ విశాఖపట్నంలోని సెంటర్ ఫర్ ఎమోషనల్ ఎడ్యుకేషన్ సొసైటీలో జరిగిన కార్యక్రమంలో అందజేశారు. ఫాదర్ రాజన్ అంతర్ముఖ శాంతి మరియు గ్లోబల్ హార్మనీపై చేసిన వినూత్న పరిశోధనలకు ఈ అవార్డు అందుకున్నారు. ముఖ్యంగా క్రైస్తవ మిస్టిసిజం, క్రైస్ట్ కాన్షస్‌నెస్ మరియు భారతీయ జ్ఞాన వ్యవస్థల మధ్య సంబంధాన్ని అధ్యయనం చేస్తూ, ఆధ్యాత్మికతను శాస్త్రీయ మరియు అనుభవాత్మక దృక్పథంతో వివరించిన ఆయన కృషి విశేషంగా ప్రశంసించబడింది. ఈ సత్కారం ద్వారా వివిధ ఆధ్యాత్మిక సంప్రదాయాల మధ్య సంభాషణను పెంపొందించడం, మరియు విశ్వమానవ సమన్వయం, ఆత్మసాక్షాత్కారం దిశగా ఆయన చేస్తున్న కృషి కి గుర్తింపుగా ఈ పురస్కారం అందించబడింది.
