

విశాఖ ఎడ్యుకేషన్ , ఏప్రియల్ 08 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ :
మీరు కేవలం విశ్వవిద్యాలయ విద్యార్థులు మాత్రమే కాదు, దేశ భవిష్యత్ కూడా అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్ అన్నారు. ఏయూ శతాబ్ధి ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న మెగా కల్చరల్ ఫెస్ట్‌లో ఈ రోజు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ
సి ఆర్ రెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సి.వి రామన్ వంటి వ్యక్తులు ఇక్కడ తమ మేధస్సుతో విశ్విద్యాలయాన్ని నడిపించారు. అటువంటి వ్యక్తులకు జేజేలు కొట్టాలి. సమాజాన్ని ముందుకు నడిపించే వ్యవస్థను మహనీయులు ఇక్కడ ప్రతిష్టించారు. మీరంతా ఈ విశ్వవిద్యాలయం భవిష్యత్తు, ఇక్కడ గడిపేసమయం మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన సమయం. ఇది మీ దిశను నిర్ణయించే సమయం. సమస్యలను ఎదుర్కొనే ధైర్యం, సమాజానికి ఉపయోగపడే బాధ్యత విద్య అందిస్తుందన్నారు. ప్రపంచాన్ని మార్చే శక్తి విద్యకు ఉందన్న నెల్సన్ మండేలా మాటలను గుర్తుచేశారు. ఏయూ జ్ఞానదీపంగా ప్రకాశిస్తూ నిలవాలి. ప్రతీ రంగంలో నాయకులుగా ఏయూ విద్యార్థులు ఎదగాలని, విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు . ఏయూ ప్రాంగణం ఒక క్యాంపస్ మాత్రమే కాదు, విలువలతో దేశ నిర్మాణంలో సైతం ముఖ్య భూమిక పోషించిందని, శతాబ్ధ కాలాన్ని పూర్తిచేసుకున్న భారతీయ వారసత్వ సంపదకు నిదర్శనంగా నేడు ఏయు నిలిచిందని అన్నారు. వివిధ రంగాలలో సమాజాన్ని ముందు నిలిపే నాయకులుగా ఎందరో ఇక్కడినుండి ఎదిగారు. అటువంటి వ్యక్తులుగా మీరుకుడా ఎదగాలని అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం చిహ్నం చూసినపుడు నాకు దీని అర్ధం తెలుసుకున్నపుడు దాని వెనుకున్న అంశాలు ఎంతో ప్రత్యేకంగా నిలచాయి. మీ ప్రేమ అభిమానం కోరుకుంటే వచ్చేవి కావు. యువతరం మనసుల్లో అనేక ప్రశ్నలు ఉంటాయి. విద్యార్థుల ప్రశ్నలు ఎంతో స్వచ్ఛంగా ఉంటాయి. గుండె లోతుల్లోంచి వారు ప్రశ్నలు సంధిస్తారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాలంటే ఒక పెద్ద సాహసంగా నేను భావిస్తాను. పుస్తకాలతో కుస్తీపట్టే మీతో మాట్లాడాలంటే చాలా ఆలోచించాలి. విద్యార్థుల దగ్గర నటిస్తే కుదరదు, అందుకే నేను మనసునే ఉపయోగిస్తాను అంటూ విద్యార్థులతో తన అనుభవాలను తెలిపారు. భగవంతుడు నాకు ఇక్కడ చదువుకునే అవకాశం ఇవ్వలేదు కానీ…మిమ్మల్ని ఈ విధంగా కలిసే అవకాశం మాత్రం ఇచ్చారు. నా స్నేహితుడు ఏయూ పూర్వ విద్యార్థి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇక్కడే ఎమ్మెస్సీ నూక్లియర్ ఫిజిక్స్ చదివాడు. ఇక్కడ ఆచార్యులు ఎంత గొప్పవారు అనే విషయాలు ఆయన నుంచి తెలుసుకున్నాను. ఏయూ శతాబ్ధి ఉత్సవాలలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలు ఉన్నప్పటికీ తరాలుగా అనేక తరాలను తీర్చిద్దుతున్న విశ్వవిద్యాలయంగా నేడు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉండటం ఒక గొప్పవిషయం అని అన్నారు. మీ ధ్యేయం సమాజ సేవ కావాలి. మీ జ్ఞానం మీ కోసమే కాకుండా, సమాజానికి దేశానికి ఉపయుక్తంగా నిలవాలి. భారత్ స్వయం సంవృద్ధి దిశగా నడుస్తోంది. రాష్ట్రం ఎడ్యుకేషన్, ఎంపవర్‌మెంట్, ఇన్నోవేషన్ దిశగా అడుగులు వేస్తోంది. మన ఆలోచనలు, విలువలు, చర్యలే నిర్ణయిస్తాయి. మీ విజ్ఞానం, ఆలోచనలు, ఇవన్నీ ఒక పరిష్కార మార్గాలను రూపొందించాలి. మీ కృషి అర్ధవంతమైన పరిష్కరాలను అందించాలి. సమాజానికి, దేశానికి ఉపయుక్తంగా నిలవాలి. స్నేహితులు, తల్లదండ్రులు మీ గురించి గర్వంగా చెప్పుకునే విధంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. బలమైన నమ్మకంతో కలలు కనండి. నిరంతర కృషి, నిబద్ధతతో నాయకత్వాన్ని వహించండి. భావితరమే నన్ను రాజకీయాల దిశగా నడపించింది. భగత్ సింగ్ త్యాగం, తత్వం చిన్న వయసులో ప్రాణత్యాగం చేసిన వారి జీవితాలు పరిశీలిస్తే, చదివితే స్వార్ధంగా బతకలేము. చదివిన చదువు ఎప్పుడూ వృధా కాదు. నేను కూడా పిహెచ్‌డి విద్యార్థిలా చదువుతాను. పుస్తక జ్ఞానాన్ని అనుభవ రూపంలోకి మార్చాలి. నా ఆఖరి శ్వాస వరకు భావితరాల కోసం పనిచేయాలని అనుకుంటున్నానుఅని అన్నారు . ప్రతీ వ్యక్తి లోని కొన్ని మంచి గుణాలు, కొన్ని మనకు నచ్చని లక్షణాలు ఉంటాయి. అదే విధంగా కనిపించే మంచి లక్షణాలను గుర్తించండి, స్వీకరించండని సూచించారు. ఓటమికి సిద్దపడే తాను రాజకీయాలలోకి వచ్చానన్నారు. గుడ్డిగా ఏ ఐడియాలజీని నమ్మవద్దని సూచించారు. జీవితం మీ ఉత్సాహంలో, కేరింతల్లో ఉంటుందని విద్యార్థులనుద్ధేశించి అన్నారు. విశ్వవిద్యాలయాలు, మనమంతా పనిచేసిది భావితరాలకోసమేనన్నారు. శతాబ్ధి ఉత్సవాల శుభాకాంక్షలను విద్యార్థులకు అందజేశారు.. శతాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ తెలిపారు. గడచిన 11 నెలలుగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. టెక్నికల్, కల్చరల్, అవుట్‌రీచ్ విభాగాలు నిర్వహించిన కార్యక్రమాలను తెలియజేశారు. ప్రధానంగా అవుట్‌రీచ్‌లో భాగంగా గ్రామీన ప్రాంతాలలో విద్యార్థులను ఉన్నత విద్య దిశగా నడిపించే విధంగా స్ఫూర్తిని నింపే కార్యక్రమాలను పాడేడు, పార్వతీపురం ప్రాంతాలలో నిర్వహించామన్నారు. కల్చరల్ ఫెస్టివల్ చైర్మన్ ఆచార్య ఎన్.విజయ్ మోహన్ మాట్లాడుతూ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఉపముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్ సొంతమన్నారు. ఆయనతో ఇటీవల కలిసిన సందర్భం గుర్తుచేసుకుంటూ, ఉపముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని విద్యార్థులకు వివరించారు. ఏయూ శతాబ్ధి ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వచ్చిన ఉపముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, ఫెస్ట్ కో చైర్మన్ ఆచార్య ఏ.పల్లవి, కన్వీనర్లు ఆచార్య ఎన్.ఎం యుగంధర్, సి.హెచ్ ఆశా ఇమ్మానియల్ రాజు, శాసన సభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు, విజయ్ కుమార్, విఎంఆర్‌డిఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, అభిషిక్త్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు….
కార్యక్రమంలో భాగంగా ముందుగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థుల నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి సాయంత్రం నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు ప్రాంగణానికి చేరుకున్నారు. వారి అభిమానం, వెలకట్టలేని ప్రేమాభిమానాలు కనిపించాయి. వేదికపై ప్రదర్శించిన వివిధ గీతాలకు విద్యార్థినులు నృత్యాలు చేస్తూ కనిపించారు. సాయంత్రం నుంచి వాతావరణం కూడా చల్లబడింది. దీనితో ఆహ్లాదకర వాతావరణంలో ఫెస్ట్ కార్యక్రమాలు ఉత్సాహభరితంగా సాగాయి. ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం యువత కేరింతలో హోరెత్తింది.











