
విశాఖ ఎడ్యుకేషన్ 28 : ఆంద్రవిశ్వవిద్యాలయంతో అరబిందో ఫార్మ ఫౌండేషన్ అవగాహన ఒప్పందం చేసుకుంది. శుక్రవారం పాలక మండలి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏయూ వైస్ చాన్సలర్ ఆచార్య జి.పి రాజశేఖర్ సమక్షంలో అవగాహన ఒప్పందంపై ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు, అరబిందో ఫార్మ ఫౌండేషన్ సీనియర్ మేనేజర్ వి.మనోహర్ రెడ్డిలు సంతకాలు చేశారు. అనంతరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. అవగాహన ఒప్పందంలో భాగంగా కెమిస్ట్రీ విభాగంలో అరబిందో ఫార్మ ఫౌండేషన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఏర్పాటు చేసే పరికరాలు, నిర్వహణ బాధ్యతలను అరబిందో ఫౌండేషన్ పర్యవేక్షిస్తుంది. ప్రయోగశాలలో అత్యాధునిక ప్రయోగశాల ఉపకరణాలను అందుబాటులో ఉంచుతారు. వీటిపై విద్యార్థులకు శిక్షణ అందించడానికి అవసరమైన నిపుణులైన సిబ్బందిని సైతం అరబిందో ఫార్మ ఫౌండేషన్ అందిస్తుంది. శిక్షణ పూర్తిచేసుకున్న విద్యార్థులకు అరబిందో ఫార్మలో ఉపాధి అవకాశాలను సైతం కల్పిస్తారు. ఎమ్మెస్సీ విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్, అనుబంధ కళాశాలల విద్యార్థులు సైతం ఇక్కడ ఏపిఎఫ్-ఎస్ఎస్ సేవలు పొందే అవకాశం ఉంది. పది సంత్సరాల కాలపరిమితికి ఈ ఎంఓయూ చేసుకున్నారు. కార్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం. వి. ఆర్ రాజు, అరబిందో ఫార్మ సంస్థ ప్రెసిడెండ్ డాక్టర్ రామ శ్రీనివాస్, ఏయూ రసాయ శాస్త్ర విభాగాధిపతి ఆచార్య శైలజ, ఆచార్య బసవయ్య, ఆచార్య సిద్దయ్య, ఆచార్య శ్యామల అవుట్రచ్ విభాగం డీన్ ఆచార్య డి. లలిత భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
