అనుబంధ కళాశాలలు ఎన్ ఐ ఆర్ ఎఫ్ ర్యాంకింగ్ కి దరఖాస్తు చేయాలి, ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి రాజశేఖర్

ఎడ్యుకేషన్

విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 28 : విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా పనిచేస్తున్న కళాశాలలు నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ ఐ ఆర్ ఎఫ్) కు దరఖాస్తు చేయాలని ఏయు వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి రాజశేఖర్ అన్నారు. శుక్రవారం ఉదయం బీచ్ రోడ్ లోని ఏయు కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఉన్నత విద్య మండలి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాల, కళాశాలల ఎన్ ఐ ఆర్ ఎఫ్ సమన్వయకర్తలకు నిర్వహించిన ప్రత్యేక ఒకరోజు వర్క్ షాప్ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకీకృత సమాచారాన్ని కలిగి ఉండడం ఎంతో అవసరమని, వివిధ ర్యాంకింగ్ లకు దరఖాస్తు చేసే విషయంలో ఈ సమాచారం కీలకంగా నిలుస్తుందని ఉదాహరణలతో వివరించారు. అనుబంధ కళాశాలలను బలోపేతం చేసే విధంగా ఆంధ్ర విశ్వవిద్యాలయ పరంగా సహకారాన్ని అందిస్తామని ప్రకటించారు. దీనిలో భాగంగా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాములు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆసక్తి కలిగిన కళాశాలలు తమను సంప్రదిస్తే వారి కళాశాలలోని ఎఫ్ఎపి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తామని అన్నారు. తద్వారా బోధనా సిబ్బంది సామర్ధ్యాలను పెంపొందించడానికి సాధ్యపడుతుందని తెలిపారు. అనుబంధ కళాశాలలో తప్పనిసరిగా తమ వద్ద చదువుకున్న పూర్వ విద్యార్థుల సమాచారాన్ని సమగ్రంగా కలిగి ఉండాలని చెప్పారు. విద్యార్థులే కళాశాలలకు, విశ్వవిద్యాలయానికి బ్రాండ్ అంబాసిడర్లుగా నిలుస్తారని అన్నారు. అనుబంధ కళాశాలలో పనిచేసే అధ్యాపకులు పరిశోధనా పరంగా సహకారం. అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అధ్యాపకులు నిర్దిష్ట సమయాన్ని పరిశోధనలు, తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడం కోసం కేటాయించుకోవాలని సూచించారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు తమ పనితీరుతో ప్రగతి చూపుతున్నప్పటికీ పర్సెప్షన్లో కొంత వెనకబడి పోతున్నాయని, దీనిని మెరుగుపరుచుకోవడం ఎంతో అవసరమని అన్నారు. ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఆచార్య ఎస్. విజయ భాస్కర రావు మాట్లాడుతూ జాతీయ సగటు తో సమానంగాను, అంతకంటే ఎక్కువగా రాష్ట్ర సగటు ఉండాలని సూచించారు. పరిశోధనల్లో ఎంతో మెరుగుపరుచుకోవాలని అన్నారు. అదేవిధంగా ఉన్నత విద్యకు వచ్చే విద్యార్ధుల సంఖ్య కూడా గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. గత దశాబ్ద కాలంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థిరమైన ప్రగతిని సాధిస్తూ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో మెరుగైన స్థానాన్ని సాధించడం జరుగుతోందన్నారు. ఏయు సైతం మరింత మెరుగైన స్థానాన్ని సాధించే దిశగా కృషి చేయాలని చెప్పారు. దీనిలో భాగంగా పరిశోధనలను పెంచడం, పరిశ్రమలతో అనుసంధానించడం ఎంతో అవసరం అన్నారు. నాణ్యవంతమైన పరిశోధనలు జరిగే దిశగా కృషి జరగాలని సూచించారు. త్వరలో విశ్వవిద్యాలయాలన్నీ టికి ఒకే విధమైన రీసెర్చ్ మెథడాలజీ శిక్షణ కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలలలో ఉన్న ఐక్యూఏసీ కేంద్రాలను ఉన్నత విద్యామండలితో అనుసంధానించే ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. ప్రతి కళాశాల రీసెర్చ్, ఇన్నోవేషన్ పై దృష్టి సారించాలని ఇండస్ట్రీ అడ్వైజర్ బోర్డు కలిగి ఉండాలని అన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి అధికారి డాక్టర్ పి. అనిల్ కుమార్ మాట్లాడుతూ ఎన్ ఐ ఆర్ ఎఫ్ ర్యాంకింగ్ లకు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలతో పాటు కళాశాలలు సైతం పెద్ద శంఖ్యలో దరఖాస్తు చేయాలని చెప్పారు. దీనికోసం అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏయూ వేదికగా నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిశోధనా రంగంలో చేస్తున్న అభివృద్ధి పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ఏయూ ఔట్రీచ్ విభాగం ఇన్చార్జిడిన్ ఆచార్య డి.లలిత భాస్కర్ స్వాగతం పలికారు. అనంతరం ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్వర్క్ డైరెక్టర్ ఆచార్య దేవిక పి మదాలి. ఐక్యుఏసి సలహాదారు ప్రొఫెసర్ జి అగస్టీన్ మణిరాజ్ పాండియన్ లు ప్రత్యేక ప్రసంగాలను అందించారు. మధ్యాహ్నం నిర్వహించిన కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎస్వీ. జయభాస్కర రావు, డాక్టర్ పి.అనిల్ కుమార్ లు సమగ్రంగా అవగాహన కల్పించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య పి.కింగ్. డీన్లు ఆచార్య ఎన్. సాల్మన్ బెన్ని, బి. ఆనంద గజపతి రాజు, పి.వెంకట రావు, బి.కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *