
విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 27 : సుస్థిర సమాజ అభివృద్దికి సరికొత్త వాణిజ్య నమూనాలు అనే అంశంపై గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు గురువారం ప్రారంభంఅయింది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి 150 మందికి పైగా పరిశోధకులు, పారిశ్రామిక వేత్తలు, ప్రణాళికా నిపుణులు, వాణిజ్య నిపుణులు ఈ సదస్సుకు హజరు అయ్యారు. సదస్సును అమెరికాలోని పెన్‌స్టేట్ విశ్వవిద్యాలయం బిజినెస్ స్కూల్ డీన్ ప్రొఫెసర్ అనగప్ప గుణశేఖరన్ ముఖ్యఅతిధిగా హజరై ప్రారంభిస్తూ కర్బన ఉద్గారాలను తగ్గించే విధంగా, సమాజ హితంగా, డిజిటెల్ పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ నూతన వాణిజ్య నమూనాలను రూపొందించుకోవలసి ఉంటుందన్నారు. వ్యర్ధాల నుంచి రీసైక్లింగ్ పద్దతిలో సంపదను సృష్టించే విధంగా సర్య్కులర్ ఎకానమి ప్రపంచ దేశాలకు అవసరమన్నారు. నూతన వ్యాపారాలు పర్యావరణానికి మేలు చేసేవిగా ఉన్నప్పుడే దీర్ఘకాలం మనుగడ సాగించగలవన్నారు. సుస్థిర అభివృద్ది నినాధం ప్రస్తుతం నిర్వహణలో ఉన్న పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు ఎదగడానికి ఒక మంచి అవకాశంగా ఆయన పేర్కొన్నారు. హంగ్‌కాంగ్ విశ్వవిద్యాలయం డిజిటెల్ ఇన్నోవేషన్ నిపుణుడు డాక్టర్ కె.ప్రసన్న మాట్లాడుతూ కృత్రిమ మేధ డేటా ఆధారంగా మాత్రమే పనిచేస్తుందని ఈ కారణంగా కృత్రిమ మేధ ప్రయోజనాలను పొందాలంటే వివిధ రంగాలలో నిత్యం సమాచారాన్ని సేకరించి (డేటా కలక్షన్) సమయానుకూలంగా వాడుకోగలిగిన వ్యవస్థ ఉండాలన్నారు. విశాఖలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఉద్యోగాలను సృష్టించడం, సమాజానికి ఉపయోగపడే కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని అభివృద్ది చేసుకోవడం అవసరం అన్నారు. వ్యవసాయ, వైద్య, విద్యా, వాణిజ్య రంగాలలో కృత్రిమ మేధ రానున్న రోజులలో బలమైన ప్రభావాన్ని చూపించనున్నదని తెలిపారు. గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్ మరియు నిర్వాహక కమిటి ఛైర్మన్ ప్రొఫెసర్ రాజా.పి.పప్పు మాట్లాడుతూ ఆర్ధిక రంగంలో వస్తున్న మార్పులు వాటి ప్రభావంతో రూపు దిద్దుకుంటున్న వాణిజ్య నమునాలపై ప్రముఖల ప్రసంగాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సదస్సు సహ ఛైర్మన్ ప్రొఫెసర్ ఎన్.సాయి సుధాకర్ మాట్లాడుతూ ఈ సదస్సులో వాణిజ్యరంగంపై పర్యావరణ మార్పుల ప్రభావం, డిజిటల్ రంగంలో వస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానం పై సహితం సదస్సులో చర్చిస్తామని తెలిపారు. అమెరికా, చైనా, యుకే, కెనడా తదితర దేశాల నుంచి విద్యా రంగ నిపుణుల సహితం సదస్సులో పాల్గొన్నారు.
