Visakhapatnam, November 13 : యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. విశాఖపట్నం ఐటీ హిల్స్ లో పలు ఐటీ కంపెనీలకు భూమి పూజ నిర్వహించిన అనంతరం అక్కడి ఐటీ ఉద్యోగులతో లోకేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి లోకేష్ ప్రసంగిస్తూ ప్రపంచం ఏపీ వైపు చూస్తోందని అందుకే విశాఖపట్నంకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. వచ్చిన అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని సూచించారు. ఏపీ, ఇండియా గర్వపడే విధంగా కృషిచ్చేయాలన్నదే మా లక్ష్యమని పేర్కొన్నారు. ఏపీని కాల్నిఫోర్నియా ఆఫ్ ఈస్ట్ గా తీర్చిదిద్దుతామన్నారు. ఈ ప్రయాణంలో మీరందరూ భాగస్వామ్యం కావాలనికోరారు. హైదరాబాద్ ఈ స్థాయికి రావడానికి 35 ఏళ్ల సమయం పడితే విశాఖ అభివృద్ధికి పదేళ్లు చాలన్నారు. మేం అందరం రాష్ట్ర అభివృద్ధికి చాలా కష్టపడుతున్నాం. చాలా మంది రాజకీయ నాయకులకు ఒక్క అవకాశమే వస్తుంది. మాకు విశాఖ, అమరావతిని అభివృద్ధి చేసేందుకు రెండు అవకాశాలు లభించాయన్నారు. మున్ముందు విశాఖకు అనేక కంపెనీలు తరలివస్తాయని ధీమా వ్యక్తం చేశారు. యువత భాగస్వామ్యంతోనే భారతదేశం నెం.1 ఎకానమీగా రూపుదిద్దుకుంటుంది. ప్రపంచం వికసిత్ భారత్ కోసం పీఎం నరేంద్ర మోదీ విశేషంగా కృషిచేస్తున్నారు. విశాఖను ఐటీ కేంద్రగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తోంది. వచ్చే పదిహేనేళ్లు మనవే. మన లక్ష్యాన్ని, అభివృద్ధిని చేరుకోవాలంటే మనలో ప్రతి ఒక్కరికీ ఆ కసి ఉండాలని హిత బోధ చేశారు. ప్రతి ఒక్కరం ఎంతో కష్టపడి పనిచేయాలి. ఆంధ్రప్రదేశ్ కు, భారతదేశానికి గర్వకారణంగా నిలవాలి. అందరూ విశాఖపట్నం బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలన్నారు. ప్రతి ఒక్కరూ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి ఎపి అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలన్నారు. ఇక్కడికి వచ్చే తెలుగు ప్రజలు, భారతీయులు ఈ అద్భుతమైన కొత్త కంపెనీల్లో పనిచేయబోతున్న వారందరినీ ఆత్మీయంగా స్వాగతించాలి. విశాఖపట్నం పరిశుభ్రంగా, పచ్చగా ఉండాలి. మన నగరం దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలవాలి. దానికోసం మన వంతు కృషి చేయాలన్నారు.
