ఆంధ్ర విశ్వవిద్యాలయం, మార్చ్ 26: రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అర్హత పరీక్ష ఏపీసెట్ 2025 ప్రవేశ పరీక్షలు ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఏపీసెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య జి ఎం జె రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షకు 32,779 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 65 పరీక్షా కేంద్రాలలో 30 సబ్జెక్టులలో , మూడు సెషన్స్ లలో ఆన్లైన్ విధానంలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైన అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థులు నిర్ణీత సమయం కంటే ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన సూచించారు. 28వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పరీక్షకు 9359 మంది దరఖాస్తు చేసుకున్నారు. 29వ తేదీన ఉదయం సెషన్ కి 12,491 మంది, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించే సెషన్ కి 10,929 మంది దరఖాస్తు చేశారు. విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని నేరుగా ఆన్లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షకు హాజరుకావాలని సూచించారు.