Visakhapatnam : ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భద్రతను మరింత బలోపేతం చేసే చర్యలలో భాగంగా విద్యార్థులు, పరిశోధకులు, బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డులను విశ్వవిద్యాలయ ప్రాంగణంలో విధులు నిర్వహించే సమయంలో ధరించాలని రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు ఉత్తర్వులు జారీ చేసారు. గుర్తింపు కార్డులు ధరించని విద్యార్థులు, పరిశోధకులు, ఉద్యోగులను, విశ్వవిద్యాలయ ప్రాంగణంలోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఏయూ క్యాంపస్ కళాశాలల ప్రిన్సిపల్స్, విభాగాధిపతులు తమ పరిధిలోని విద్యార్థులు, పరిశోధకులు, ఉద్యోగులు విశ్వవిద్యాలయ పని వేళలలో తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డులను ధరించే విధంగా చూడాలని రిజిస్ట్రార్ ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. 13 వతేదీ మద్యాహ్నం నుంచి ఇంజనీరింగ్ కళాశాల తరగతుల రద్దు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానం వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగనున్న పార్ట్నర్ షిప్ సమిట్ – 2025 నేపథ్యంలో ఈనెల 13వ తేదీ మధ్యాహ్నం నుంచి 15వ తేదీ వరకు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు తరగతులను రద్దు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు తెలిపారు. బద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జ రిగిందని తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు ప్రత్యేక అనుమతి ఇస్తున్నామని, వారు తమ గుర్తింపు కార్డులను చూపి బయటకు వెళ్ళవచ్చునని తెలిపారు. విద్యార్థినులు మద్దిలపాలెం గేటు గుండా బయటకు వెళ్లాలని, విద్యార్థులు పోలమాంబ ఆలయం పక్కన ఉన్న గేటు ద్వారా తమ గుర్తింపు కార్డులు చూపి బయటకు వెళ్ళవచ్చునని చెప్పారు.
