


విశాఖ ఎడ్యుకేషన్, మార్చ్ 5 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్ర విభాగంలో అరోబిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అత్యాధునిక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కేంద్రంలో ఏం ఎస్ సి కెమిస్ట్రీ చదువుతున్న విద్యార్థులకు ప్రాయోగిక శిక్షణ అందించేందుకు సుమారు పది కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక ఫార్మా యంత్రాలు – ఎచ్ పి ఎల్ సి, జీసీ , డిస్సీ , పి ఎస్ డి మొదలగు పరికరాలు అమర్చబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ హాజరై నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు అవసరమైన ఉపాధి నైపుణ్యాలను పెంపొందించడానికి ఈ కేంద్రంలో అందించే శిక్షణ ఉపయుక్తంగా నిలుస్తుందన్నారు. ఈ సేవలను ఏయూ అనుబంధ కళాశాలల విద్యార్థులకు సైతం చేరువ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి సమీకృత ప్రయోగశాలలు ఎంతో విలువైన ప్రత్యక్ష జ్ఞానాన్ని విద్యార్థులకు అందిస్తాయన్నారు. ఈ సంద్భంగా అరోబిందో ఫార్మా ఫౌండేషన్ యాజమాన్యం కె . నిత్యానంద రెడ్డి, పి . శరత్ చంద్ర రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. అరోబిందో ఫార్మా ఫౌండేషన్ నుంచి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ యూ. ఎన్.బి. రాజు మాట్లాడుతూ ఏయూ యాజమాన్యానికి ఇటువంటి కేంద్రం ఏర్పాటుకు అనుమతించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. దేశ వ్యాప్తంగా 35 కేంద్రాలలో అరబిందో ఫార్మ సేవలు అందిస్తోందని, 44 వేల మంది సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నారన్నారు. ఔషధ తయారీ రంగంలో క్వాలిటీ కంట్రోల్ ఎంతో కీలక విభాగంగా నిలుస్తుందన్నారు. ఏయూ విద్యార్థులకు ప్రత్యక్ష శిక్షణ, నైపుణ్యాల వృద్ధి చేసే విధంగా ఈ కార్యక్రమం నిలుస్తుందన్నారు. ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.వి.ఆర్ ఎం. రాజు మాట్లాడుతూ ఏయూ రసాయన శాస్త్ర విభాగంలో రూ 11 కోట్ల వ్యయంతో ఈ ఆధునిక స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని అరబిందో ఫార్మ సంస్థ ఏర్పాటు చేసిందన్నారు. శిక్షణ సిబ్బంది, ప్రయోగ పరికరాల నిర్వహణ బాధ్యతలను సైతం అరబిందో ఫార్మ చేపడుతుందన్నారు. కార్యక్రమంలో హెడ్-కార్పొరేట్ క్వాలిటీ డాక్టర్ కె. రామ శ్రీనివాస్, అరోబిందో ఫార్మా ఫౌండేషన్ సంస్థ తరుపున ఎస్ డి సి సెంటర్ హెడ్ మనోహర్ రెడ్డి, మరియు శిక్షణ బృందం పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగాధిపతి ఆచార్య బి.వి.వి. శైలజ, ఏయు మాజీ విసి ఆచార్య జి నాగేశ్వర రావు, ప్రొఫెసర్ సిద్ధయ్య, ఆచార్య బసవయ్య, ఆచార్య శ్యామల తదితర అధ్యాపకులు, సిబ్బంది హాజరయ్యారు. ఈ సెంటర్ ద్వారా అత్యాధునిక ఫార్మా యంత్రాలతో ప్రాక్టికల్ ట్రైనింగ్ అందించడం వల్ల ఏం ఎస్ సి కెమిస్ట్రీ విద్యార్థులు ఫార్మా కంపెనీల్లో, ముఖ్యంగా క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ శిక్షణ ద్వారా విద్యార్థులు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు సంపాదించి, ఉద్యోగ అవకాశాలు పెంచుకోవచ్చని అధికారులు వివరించారు. ఈ భాగస్వామ్యం విద్య సంస్థలు-పరిశ్రమల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేస్తూ, విద్యార్థుల ఉపాధి అవకాశాలను పెంచే దిశగా ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తుంది.
