

విశాఖ ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 4 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్రవిశ్వవిద్యాలయం వేదికగా తొలి విమెన్ ఆయుర్వేద పరిషద్ కాన్ఫరెన్స్ (వేపాకాన్-2026) ను ఈ నెల 6,7 తేదీలలో నిర్వహిస్తున్నట్లు ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ తెలిపారు. బుధవారం ఉదయం అకడమిక్ సెనేట్ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రెండు రోజుల జాతీయ సదస్సు వివరాలను వివరించారు. బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారంతో విశ్వ ఆయుర్వేద పరిషత్, ఏయూ డాక్టర్ దుర్గాబాయి దేశముఖ్ మహిళా అధ్యయన కేంద్రం సంయుక్త సహకారంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న తొలి మహిళా ఆయుర్వేద సదస్సుకు ఆంధ్రవిశ్వవిద్యాలయం వేదికగా నిలవడం సంతోషాన్నిస్తోందన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న సమయంలో సమాజ ఉపయుక్తంగా నిలచే, మహిళా సాధికారతకు దోహదపడే కార్యక్రమానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారంతో, ఏయూ భాగస్వామ్యంతో ప్రతిష్టాత్మకంగా సదస్సు నిర్వహణకు ఏర్పట్లు చేస్తున్నట్లు తెలిపారు. స్వస్థ నారీ-సశక్త భారత్ నినాదంతో ఈ సదస్సు నిర్వహణ జరుగుతుందన్నారు. దేశ వ్యాప్తంగా వెయ్యి మందికిపైగా మహిళా ఆయుర్వేద నిపుణులు, ఉత్పత్తుల తయారీదారులు, ఈ రంగంలో పనిచేస్తున్న మహిళలు సదస్సులో పాల్గొంటారన్నారు. ఏయూ ఆచార్యులు, విద్యార్థినులు సదస్సులో భాగస్వాములు అవుతారన్నారు. సదస్సు సమన్వయకర్త, ఏయూ డాక్టర్ దుర్గాబాయి దేశముఖ్ మహిళా అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య ఏ. పల్లవి మాట్లాడుతూ మహిళ ఆరోగ్యం, అభివృద్ధి, సాధికారతలకు చిహ్నంగా సదస్సు నిలుస్తోందన్నారు. మహిళల నిర్వహణలో, మహిళల కోసం నిర్వహిస్తున్న మహిళా సదస్సుగా ఇది ఎంతో ప్రత్యేకమన్నారు. దేశ వ్యాప్తంగా ఆయుర్వేదరంగంలో పనిచేస్తున్న మహిళలు ఈ సదస్సులో పాల్గొంటారన్నారు. విశ్వ ఆయుర్వేద పరిషత్ ప్రతినిధి డాక్టర్ సాహితి మాట్లాడుతూ ఆయుర్వేద రంగంలో సేవలందిస్తున్న మహిళా వైద్యులు, మహిళా పారిశ్రామిక వేత్తలు, ఉత్పత్తులు ఒకే వేదికపై ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సదస్సు నిర్వహణకు ఏయూ అందిస్తున్న సహకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకంగా ఒక ఆయుర్వేద ఉత్పత్తుల ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు, డీన్ అవుట్ రీచ్ ఆచార్య కె. రమాసుధ, అసోసియేట్ డీన్ బ్రాండింగ్- మీడియా డాక్టర్ ఎన్. సాల్మన్ బెన్నీ, డాక్టర్ శ్రీబాల, డాక్టర్ మహతి తదితరులు పాల్గొన్నారు.

