

విశాఖపట్నం, మార్చ్ 5 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్: విత్య వ్యక్తి ప్రగతికి దోహదపడుతుందని, దీనికి గ్రహించి ఉన్నత విద్య దిశగా బాలికలు దృష్టి సారించాలని బెర్హంపూర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గీతాంజలి దాస్ అన్నారు. ఏయూ దుర్గాబాయి దేశముఖ్ మహిళా అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా గురువారం సాయంత్రం ఏయూలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమానత్వం, హక్కులు మహిళలకు పూర్తిస్థాయిలో చేరువ కావాలన్నారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమేటిక్స్ (స్టెమ్) రంగాలలో మహిళల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్య్ర్య పోరాటంలో సైతం మహిళలు ఎంతో కీలక భూమిక పోసించారన్నారు. మహిళలు సాధించిన విజయాలను గుర్తుచేసుంటూ వేడుకలు జరుపుకునే రోజుగా మహిళా దినోత్సవం నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ మాట్లాడుతూ మహిళలు నాయకత్వంలో ముందుకు రావాలన్నారు. దీనికి ప్రోత్సహిస్తూ ప్రిన్సిపాల్స్, డీన్స్, విభాగాధిపతులుగా మహిళలకు బాధ్యతలు అందించామని, వీటిని వీరు సమర్ధవంతంగా తమకు అప్పగించిన బాధ్యతలను నిర్వహిస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల బాలికలు ఉన్నత విద్య దిశగా తగిన ప్రోత్సాహంఅందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆదికవి నన్నయ వర్సిటీ వీసీ ఆచార్య ఎస్. ప్రసన్న శ్రీ విద్యార్ధిగా, పరిశోధకురాలిగా, ఆచార్యురాలిగా, ఉపకులపతిగా తన ప్రస్థానాన్ని వివరిస్తూ, ఈ ప్రయాణంలో తనకు సహకారం అందించి, వెన్నంటి నిలచిన మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ఆర్. రజని మాట్లాడుతూ వేద కాలం నుంచి మహిళలు మన సమాజంలో ఎంతో ఉన్నతంగా జీవించారన్నారు. ఏయూ పూర్వవిద్యార్థి, విశ్రాంత ఐఏఎస్ అధికారిణి బి.ఉదయ లక్ష్మి మాట్లాడుతూ నేటికీ అనేక దేశాలలో మహిళలపై వివక్షలు కొనసాగుతున్నాయని చెబుతూ, మహిళా దినోత్సవం జరుపుకోవడానికి వెనుక ఉన్న చారిత్రక పోరాటాలు, ప్రాధాన్యతలను వివరించారు. ప్రతీ మహిళ దేశ పురోగతిలో భాగం కావాలని సూచించారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ సతీమణి శ్రీమతి పావని మాట్లాడుతూ సమాజంలో స్త్రీ,పురుషులు పరస్పరం గౌరవించుకోవడం, సహకారం అందించుకోవడం, కలసి ప్రగతి సాగించడం దిశగా ఆలోచన చేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ వీసీలు ఆచార్య నిరుపమ రాణి, ఆచార్య రొక్కం మాధవి, శాస్త్రవేత్త డి.వి మహాలక్ష్మి, లెఫ్టెనెంట్ కమాండర్ సి. హెచ్ ఝాన్సి, మహిళా అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య ఏ. పల్లవి తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో భాగంగా అతిధులను సత్కరించి జ్ఞాపికలను బహూకరించారు. కార్యక్రమంలో ముందుగా గణపతి నృత్యంతో ప్రారంభించారు. అనంతరం అనిట్స్ కళాశాల విద్యార్థినులు మహిళ విభిన్న రంగాలలో సాగిస్తున్న ప్రయాణం వివరిస్తూ ప్రదర్శించిన రూపకం, వచ్చెను అలివేలు మంగా అంటూ వేదికపై నవరసాలను ఒలికించిన ఏయూ విద్యార్థిని నృత్యం ఆకట్టుకున్నాయి.




