

విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 22 : విశ్వవిద్యాలయంలో చేరిన తొలిరోజు నుంచి విద్యార్థులు తమ కెరియర్ ప్లానింగ్ చేసుకోవాలని ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి రాజశేఖర్ అన్నారు. ఏయూ సైన్స్ అండ్ టెక్నాలజీ క ళాశాల ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ప్రధమ సంవ త్సరం విద్యార్ధుల ఇండక్షన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్ధులు రెండు సంవత్సరాల కాలాన్ని పూర్తిస్తాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముందుగా ప్రతీ విద్యార్థి కరికులంను తెలుసుకోవడం, ప్రతీ సబ్జెక్టును అభ్యశించిన తరువాత తనకు లభించే జ్ఞానం, ఫలితాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. హాస్టల్ మెస్ల నిర్వహణలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని స్వాగతిస్తున్నామని, వివిధ కమిటీలలో వారు చురుకైన భూమిక వహిస్తూ నాణ్యత, పరిశుభ్రత మరింత పెంచే విధంగా తమ విలువైన సూచనలను అందించాలన్నారు. విద్యార్థులను క్రీడా సాంస్కృతిక అంశాలలో భాగం చేసే విధంగా స్టూడెంట్స్ వెల్ఫేర్ కౌన్సిల్, వసతుల కల్పన దిశగా టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేసామని, వీటితో కలసి పనిచేయాలని విద్యార్థులకు తెలిపారు. పరీక్షలు రాసే సమయంలో నైతిక విలువలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అనైతిక చర్య లకు పాల్పడి కెరియర్ను నాశనం చేసుకోవద్దన్నారు. పరీక్షల నిర్వహణలో విజిలెన్స్ను పెంచామన్నారు. మార్కులు అవసరమే కాని.. మార్కులు వ్యక్తి మేధస్సకు కొలమానం కాబోవని చెప్పారు. సామరస్యతకు ప్రాధాన్యత ఇస్తూ, విశ్వవిద్యాలయ ప్రతిష్టను పెంచే దిశగా అందరూ కలసి ముందుకు సాగాలన్నారు. శతాబ్ది సంవత్సరంలో వర్సిటీలో ప్రవేశం పొందిన ప్రత్యేక బ్యాచ్ గా మీరంతా నిలచి పోతారని చెబుతూ విద్యర్ధులను అభినందించారు. విద్యార్థులు తమ పూర్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూ, ఆలోచనలను వికసింప చేయాలని సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎం.వి.ఆర్ రాజు అన్నారు. అభ్యసనం అనేది నిరంతర ప్రక్రియ అని, విద్యార్థులు పాఠ్యపుస్తకాలజ్ఞానంతో పాటు వర్తమాన శాస్త్ర సంబంధిత అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. క్లిష్టమైన ఆలోచన విధానం, సృజనాత్మకత కలిగి ఉండాలని చెప్పారు. ప్రతి విద్యార్థి జీవితంలో విశ్వవిద్యాలయంలోకి రావడం అనేది ఒక ప్రత్యేకమైన దశగా నిలుస్తుంది అని చెప్పారు. విశ్వవిద్యాలయంలో ఉన్న బోధన, పరిశోధన వసతులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని చెప్పారు. విద్యార్ధులకు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరాన్ని వివరిస్తూ, వారికి దిశానిర్ధేశం చేసారు. కార్యక్రమంలో భాగంగా విభాగాధిపతులు, ప్రధమ సంవత్సరం విద్యార్థులు తమ ఆలోచనలను పంచుకున్నారు.
