


విశాఖ ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 6 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : భారతీయ ఆయుర్వేదానికి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభిస్తోందని నేషనల్ కమిషన్ ఆఫ్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ (ఎన్.సి.ఐ.ఎస్. ఎం) చైర్ పర్సన్ డాక్టర్ మనీష కొటేకర్ అన్నారు. బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారంతో విశ్వ ఆయుర్వేద పరిషత్, ఏయూ డాక్టర్ దుర్గాబాయి దేశముఖ్ మహిళా అధ్యయన కేంద్రం సంయుక్తంగా నిర్వహిస్తున్న తొలి జాతీయ విమెన్ ఆయుర్వేద పరిషత్ కాన్ఫరెన్స్(వేపాకాస్-2026)ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ మనీష్ కోటేకర్ మాట్లాడుతూ తొలిసారిగా మహిళల కోసం నిర్వహిస్తున్న జాతీయ సదస్సును నిర్వహించడం, దీనిలో తాను భాగస్వామి కావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందన్నారు. ముఖ్యంగా వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఏయూలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గర్వకారణమన్నారు.దేశం నలుమూలల నుంచి విచ్చేసిన ఆయుర్వేద వైద్యులు హాజరు కావడం, ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమన్నారు. మహిళా సాధికారత విషయంలో దేశ రాజ్యాంగ రచన, నిర్మాణంలో కూడా మహిళలు ముఖ్య భూమిక పోషించారని అన్నారు. డాక్టర్ దుర్గాబాయి దేశముఖ్ రాజ్యాంగ రచనలో ప్రముఖ పాత్ర పోషించారని ఆమె పేరుతో ఏయూలో మహిళా అధ్యయన కేంద్రం ఏర్పాటు చేసి నిర్వహించడం ఎంతో గర్వకారణమన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు సుష్మా స్వరాజ్ ఎంతో కృషి చేసారని గుర్తు చేసుకున్నారు. దీని ఫలితంగా ప్రత్యేక మంత్రిత్వ శాఖను ప్రధానమంత్రి మోదీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతీ జిల్లాలో ఆయుష్ ఆయుర్వేద వైద్యాలయాలు, ఫార్మశీలు నెలకొల్పడానికి కృషిచేస్తున్నామన్నారు.అభ్యున్నతికి కృషి చేయడం ద్వారా దేశ అభివృద్ధిలో మనం కూడా సహకరించడం సాధ్యమన్నారు. ఆయుర్వేద రంగంలో విద్యను అభ్యశించిన మహిళలు అంతా ప్రాక్టీసు ప్రారంభించాలని సూచించారు. కుటుంబం నుంచి లభిస్తున్న ప్రోత్సాహంతో వీరు ఈ వృత్తిని సమర్ధవంతంగా నిర్వహించడం సాధ్యపడుతోందన్నారు. త్వరలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఆయుర్వేద వైద్య కళాశాలల్లో మహిళలకు అన్ని సదుపాయాలు కల్పించే విధంగా కృషిచేస్తున్నామన్నారు.ప్రతీ వ్యక్తి జీవితంలో ఆయుర్వేదం అంతర్గతంగా ఉందని ఏయూ వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ అన్నారు. భారతీయ జ్ఞాన వ్యవస్థలలో ఒకటిగా నిలచే ఆయుర్వేదం భవిష్యత్తులో మరింత ప్రఖ్యాతిని గాంచుతుందన్నారు. ఈ దిశగా అందరూ సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. యువ ఆయుర్వేద వైద్యులు సదస్సును సద్వినియోగం చేసుకుంటూ తమ జ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. ఏయూ ఈ సదస్సును నిర్వహిండం ఎంతో గర్వకారణమన్నారు. ఏయూ శతాబ్ది వేడుకలను జరుపుకుంటోందని, ఏయూ విజన్, గ్రామీణ విద్యార్థులతో అనుసంధానం చేస్తూ ఉన్న విద్య అవకాశాలను వారికి తెలియజేస్తున్న రూరల్ అవుట్డోచ్ కార్యక్రమాలను వివరించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ 2014లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో భారతీయ వైద్య రంగానికి పూర్వవైభవం సంతరించుకుందన్నారు. ప్రాచీన జ్ఞానాన్ని, శాస్త్రీయ ఆధారాలు, పరిశోధన ఫలితాలలో పటిష్టం చేయడం జరుగుతోందన్నారు. సమగ్ర వైద్యం దిశగా ప్రజలు ఆలోచన చేస్తున్నారని, వ్యాధి చికిత్స కంటే వ్యాధి రాకుండా చూడటానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. భారతీయ వైద్య విధానానికి మంచి భవిష్యత్తు ఉందని ఈ రంగం అపార అవకాశాలను అందిస్తుందన్నారు. మనం ఎంత జ్ఞానాన్ని పొందగలం, తిరిగి సమాజానికి ఎంత వరకు ఇవ్వగలం అనేది ఎంతో ప్రధానమన్నారు. సంజీవిని కార్యక్రమం ప్రాధాన్యతను వివరించారు. భారతీయ వైద్య విధానాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం, తోడ్పాటును అందిస్తాయి.విశ్వ ఆయుర్వేద్ పరిషత్ అధ్యకుడు మహేష్ వ్యాస్ మాట్లాడుతూ ఆయుర్వేదానికి ఉజ్వల భవిష్యత్ ఉందన్నారు. ఆయుర్వేదానికి స్వర్ణయుగం ప్రస్తుతం నడుస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేద రంగానికి తగిన ప్రోత్సాహం అందిస్తూ బడ్జెట్లో నిధులను అదిస్తోందన్నారు. డబల్యూ హెచ్.ఓ సైతం భారతీయ శాస్త్రీయ వైద్య విధానాలను ప్రపంచ వ్యాప్తంగా వ్యాధుల నివారణకు ఉపయుక్తంగా నిలవాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉందని తెలిపిందన్నారు. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్ మాధవ్ మాట్లాడుతూ భారతీయ ఆయుర్వేదానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందన్నారు. మహిళా శక్తికి, మేధో సంపదకు నిదర్శనంగా ఈ వేదిక నిలుస్తోందన్నారు. ప్రతీ మహిళా తన ఇంటికి ఆయుర్వేద వైద్యురాలితో సమానమన్నారు. ఇంటిలో వంటలో ఉపయోగించే ప్రతీ పదార్థం వ్యాధులను నిరోధించే శక్తిని కలిగి ఉంటాయన్నారు. సాంప్రదాయ భారతీయ వైద్య విధానాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాచుర్యం తీసుకువచ్చే విధంగా ఆయుష్ మంత్రిత్వ శాఖను తీర్చిద్దారన్నారు. ఈ దిశగా విశ్వ ఆయుర్వేద పరిషత్ చేస్తున్న కృషిని అభినందించారు. ప్రతీ వ్యాధి నుంచి ఉపశమనం అందించే శక్తి ఆయుర్వేదానికి ఉందన్నారు. ఆయుర్వేదానికి పూర్వవైభవం, ప్రాచుర్యం త్వరలో లభిస్తుందన్నారు.
విశ్వ ఆయుర్వేద పరిషత్ కార్యదర్శి, సదస్సు కన్వీనర్ డాక్టర్ సాహితి మాట్లాడుతూ ఆయుష్ విభాగం, ఏయూ సహకారంతో సంయుక్తంగా ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతోందన్నారు. దుర్గాబాయి దేశముఖ్ మహిళా అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య ఏ. పల్లవి, విశ్వాయుర్వేవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ రావు చౌదరి, రూపా కాట్టి, విశ్వ ఆయుర్వేద పరిషత్ (తమిళనాడు) డాక్టర్ క్రితిక తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా ప్రదర్శించిన గణపతి నృత్యం, సప్త మాతృక నృత్యం ఎంతగానో ఆకట్టుకున్నాయి. వ్యాప్కాన్ సదస్సు ప్రత్యేక సంచికను ఈ సందర్భంగా వేదికపై ఆవిష్కరించారు.
