విశాఖపట్నం, జనవరి 30 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : విశ్వవిద్యాలయం ప్రగతిలో మీడియా సహకారం కీలకమని ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ అన్నారు. శుక్రవారం ఉదయం ఏయూ జిఎంఆర్ స్మార్ట్ సెమినార్ హాల్లో ఆయన మీడియాతో సంభాషించారు. వారి నుంచి విశ్వవిద్యాలయ ప్రగతికి ఉపయుక్తంగా నిలచే సూచనలు, సలహాలను స్వీకరించారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య రాజశేఖర్ మాట్లాడుతూ మీడియా మిత్రులు అందించిన విలువైన సూచనలు, సలహాలను ఆచరణలో చూపుతామన్నారు. ఏయూకు సంబంధించిన ప్రగతిని నిత్యం ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రాచుర్యం కల్పించే విధంగా కృషిచేస్తామని, దీనికి మీడియా మిత్రుల సహకారం, తోడ్పాటు కూడా ఎంతో అవసరమన్నారు. ఏయు పూర్వవిద్యార్థులు మీడియా రంగంలో సేవలు అందించడం సొంతోషదాయకమన్నారు. శతాబ్ది ఉత్సవాలలో భాగంగా విజన్ డాక్యుమెంట్ రూపకలప్న చేసిన విధానం, మౌళిక వసతులు, అవుట్ రీచ్, గ్రామీణ అనుసంధానం తదితర కార్యక్రమాలను నిర్వహించిన విధానం వివరించారు. ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమాలతో అనుబంధ కళాశాలల అధ్యాపకులను పటిష్టం చేస్తున్న విధానాన్ని వివరించారు. పూర్వవిద్యార్థులతో విశ్వవిద్యాలయానికి అనుబంధం మరింత బలోపేతం చేసే విధంగా ప్రత్యేకంగా ఆలుమ్ని వ్యవహారాల డీన్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పూర్వవిద్యార్ధుల భాగస్వామ్యాన్ని విభిన్న రంగాలలో వినియోగించే విధంగా ఈ కేంద్రం పనిచేస్తుందన్నారు. పరిశ్రమలు, పరిశోధన కేంద్రాలతో చేసుకుంటున్న అవగాహన ఒప్పందాలు, వాటిని కార్యరూపంలో చూపుతున్న విధానం వివరించారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల నిర్వహణ, సవాళ్లు, అవకాశాలు, బలాలను వివరించారు. ఏయూకు బహుళ ప్రాచుర్యం తీసుకురావడానికి అవసరమైన విలువైన సూచనలను ఎప్పుడూ స్వీకరిస్తామన్నారు. మీడియాతో అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. కార్యక్రమంలో పలువురు పాత్రికేయులు పాల్గొని విశ్వవిద్యాలయం అభ్యున్నతికి దోహదపడే విధంగా పలు విలువైన సూచలను అందించారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు, డీన్ అవుట్ రీచ్ ఆచార్య కె.రమాసుధ, అసోసియేట్ డీన్ మీడియా-బ్రాండింగ్ ఆచార్య ఎన్. సాల్మన్ బెన్నీ, ప్రిన్సిపాల్స్, డీన్లు, తదితరులు పాల్గొన్నారు.