
విశాఖ ఎడ్యుకేషన్, మార్చి 23 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ :ఆంధ్ర విశ్వవిద్యాలయం తన ప్రపంచవ్యాప్త అలుమ్ని నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడానికి ఆల్మాశైన్స్ భాగస్వామ్యంతో ఒక ప్రత్యేక అలుమ్ని మేనేజ్‌మెంట్ పోర్టల్‌ను తయారు చేసింది. ఈ పోర్టల్ ను ఉపకులపతి ఆచార్య జి. పి. రాజశేఖర్ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య జి. పి. రాజశేఖర్ మాట్లాడుతూ మా అలుమ్ని ఆంధ్ర విశ్వవిద్యాలయానికి గర్వకారణం మరియు బలమైన ఆధారం. ఈ వేదిక ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అలుమ్నిని ఒకే వేదికపై కలుపుతూ, విశ్వవిద్యాలయ విద్యా మరియు అభివృద్ధి కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఇది దోహదపడుతుంది అని అన్నారు . ఈ పోర్టల్ ద్వారా అలుమ్ని నెట్‌వర్కింగ్, మార్గదర్శకత్వం (మెంటర్‌షిప్), కార్యక్రమాలు,ఉద్యోగావకాశాల వంటి అంశాల్లో సులభమైన అనుసంధానం సాధ్యమవుతుందని అన్నారు. పూర్వ విద్యార్థులు ఈ పోర్టల్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలని విశ్వవిద్యాలయం ఆహ్వానిస్తోందని ఉపకులపతి అన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ అలుమ్ని అఫైర్స్ ఆచార్య పి. శ్యామల, డీన్ అవుట్‌రీచ్ ఆచార్య కె . రామసుధ, అసోసియేట్ డీన్లు ఆచార్య ఎ. రామ నాగ హనుమాన్ మరియు డా. ఎన్. సోలోమన్ బెన్నీ, ఏ.యు. కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రిన్సిపాల్ ఆచార్య ఎం. శశి తదితరులు పాల్గొన్నారు.
