అనకాపల్లి, నవంబర్ 29: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తాజా ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్‌దారులు తమ జీవన ప్రమాణ ధృవపత్రాలు (Life Certificates) ను 2026 జనవరి 1 నుండి ఫిబ్రవరి 28 వరకు తప్పనిసరిగా సమర్పించవలసి ఉంటుందని జిల్లా ఖజానా అధికారి వి. ఎల్. సుభాషిణి తెలిపారు. నవంబర్ 25, డిసెంబర్ 25 నెలల్లో ఇప్పటికే సమర్పించిన ధృవపత్రాలు ఈ సంవత్సరానికి పరిగణించబడవని, అందువల్ల పెన్షన్‌దారులు కొత్త సంవత్సరానికి సంబంధించిన తాజా ధృవపత్రాలను నిర్దిష్ట గడువులోపే సమర్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. జీవన ప్రమాణ ధృవపత్రాన్ని జిల్లా ఖజానా కార్యాలయం, ఉప ఖజానా కార్యాలయాలు, మీసేవా కేంద్రాలు, పోస్టాఫీసులు, బ్యాంకులు లేదా జీవన ప్రమాణ యాప్ ద్వారా కూడా సమర్పించ వచ్చని సుభాషిణి పేర్కొన్నారు. ధృవీకరణ ప్రక్రియలో ఆధార్ కార్డు, పెన్షన్ ID లేదా PPO సంఖ్య, OTP కోసం మొబైల్ నెంబర్ బ్యాంక్ పాస్‌బుక్ దగ్గర ఉండాలని ఆమె తెలిపారు. పెన్షన్ దారుల సౌకర్యం కోసం అన్ని కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు కూడా తెలిపారు.
,
