
విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 24 : ఆంధ్ర విశ్వవిద్యాలయం రాజనీతి ప్రభుత్వ పాలనా శాస్త్రం విభాగాధిపతి ఆచార్య పెటేటి ప్రేమానందం ఆధ్వర్యంలో భారతదేశం యూరప్ లో ప్రజాస్వామ్య వైవిద్యం మార్పు అనే అంశంపై పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ రెక్టర్, పూర్వ ఇన్చార్జి వైస్ చాన్సర్ ఆచార్య ఇ.ఏ నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆచార్య నారాయణ మాట్లాడుతూ భారత్ యూరోప్ లో అమలవుతున్న ప్రజాస్వామ్య పద్ధతుల గురించి వివరించారు. భారతదేశ ప్రజాస్వామ్య మెరుగైన పద్ధతులతో అమలవుతోందని చెప్పారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అభివృద్ధికి ఎందరో మహానుభావులు తమ వంతు కృషి చేస్తున్నారని అన్నారు. రెండు దేశాల మధ్య సారూప్యత మరియు వైవిధ్యం గురించి ఈ పుస్తకంలో వివరించారని పుస్తక సంపాదకులను పుస్తక రచనకు సహకరించిన వారిని అభినందించారు. సభాధ్యక్షులు ఆర్ట్స్ కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఏ. నరసింహారావు మాట్లాడుతూ చరిత్ర సామాజిక నిర్మాణంలో విభిన్నత ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య ఆదర్శాలకు లోతైన నిబద్ధతను పంచుకుంటూ రెండు ప్రాంతాలు ప్రజాస్వామ్యం కేవలం పాలనా వ్యవస్థ కాదని అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చబడుతున్న సజీవ అనుభవం అని నిరూపిస్తున్నాయని తెలియ జేశారు. పుస్తక సంపాదకులు ఆచార్య పెటేటి ప్రేమానందం మాట్లాడుతూ ఈ పుస్తకం రెండు దేశాల ఉమ్మడి ప్రయాణాన్ని గుర్తు చేస్తుందని చెప్పారు. భారతదేశ మరియు యూరప్ దేశాలు ప్రజాస్వామ్యంలో నూతన ఒరవడులను సృష్టిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ముందుకు తీసుకు వెళుతున్నాయో పుస్తకంలో వివరించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో సహసంపాదకులు డాక్టర్ కె. సత్యనారాయణ, డాక్టర్ టి. నాగరాజు ప్రసంగించారు. కార్యక్రమంలో విభాగ అధ్యాపకులు డాక్టర్ హరిబాబు, డాక్టర్ రత్నరాజు, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ రాము, డాక్టర్ దంతేశ్వర పట్నాయక్, పరిశోధకులు విద్యార్థులు పాల్గొన్నారు
