విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 20 : ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) – మెరైన్ విభాగం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సులో మెరైన్ ఇంజినీరింగ్ రంగంలో ప్రముఖవిద్యావేత్త, పరిశోధకులు డా. వి.వి.ఎస్. ప్రసాద్ ని సన్మానించారు. ఈ గౌరవం ఆయన ఇంజినీరింగ్ విద్య, పరిశోధన మరియు వృత్తిపర అభివృద్ధి రంగాలలో చేసిన అసాధారణ కృషిని గుర్తిస్తూ అందించారు. ఈ సందర్భంగా ఆచార్య ప్రసాద్‌ను ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ తన కార్యాలయంలో అభినందించారు. డా.ప్రసాద్ గారు ఇప్పటివరకు 21 మంది పీహెచ్.డి విద్యార్థులను, 170మందికి పైగా ఏం.టెక్. విద్యార్థులకు మార్గనిర్దేశనం చేశారు. దేశీయ మరియు అంతర్జాతీయ ఖ్యాతిగల జర్నల్స్‌లో 153 పరిశోధనా వ్యాసాలుప్రచురించారు. 17 పేటెంట్లను సాధించి, 6 పాఠ్యపుస్తకాలను రచించారు. అలాగే, 21 జాతీయ అంతర్జాతీయ సదస్సులను విజయవంతంగా నిర్వహించారు. ఆయన విశిష్ట విద్యా ప్రావీణ్యం అనేక పురస్కారాల ద్వారా గుర్తించబడింది. వాటిలో నాలుగు స్వర్ణ పతకాలు పొందారు, ముఖ్యంగా ఇంజినీరింగ్ మరియు సాంకేతిక పరిశోధనలో విశిష్ట కృషికి ఇచ్చే ప్రతిష్ఠాత్మక కల్నల్ బి.ఎన్. బజ్పాయ్ గోల్డ్ మెడల్, నేషనల్ అవార్డ్ ఫర్ అవుట్ స్టాండింగ్ రీసెర్చ్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ప్రతిభా పురస్కార అవార్డులను అందుకున్నారు.

